పాల్వంచ రూరల్, అక్టోబర్ 11 : పాల సేకరణ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. పట్టణంలోని కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పాల సేకరణ కేంద్రం కొరకు తగిన అవకాశాలను ఆయన పరిశీలించారు.
సొసైటీ కార్యాలయంలో రెండు షెట్టర్లు ఖాళీగా ఉండడంతో పాల సేకరణ కేంద్రానికి కావాల్సిన వసతి సౌకర్యాలను పరిశీలించి, పాలకవర్గ సభ్యులతో చర్చించారు. త్వరలోనే మరొక ప్రత్యేక అధికారి సందర్శించిన తర్వాత పాల సేకరణ కేంద్రంపై నిర్ధారణ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్, సొసైటీ సభ్యులు రామ్మోహనరావు, కనగాల నారాయణ, సీఈవో లక్ష్మీనారాయణ, రూరల్ ఆర్ఐ నళినికుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.