భద్రాచలం, మార్చి 6 : వచ్చే నెలలో జరుగనున్న శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజు, డీఆర్డీఏ విద్యాచందన, ఆలయ ఈవో రమాదేవిలతో కలిసి ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముక్కోటి వేడుకలు ఎలా నిర్వహించారో అదే రీతిన విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
నవమికి ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో తమకు అప్పగించిన పనులను శ్రద్ధగా పూర్తి చేయాలన్నారు. కల్యాణం వీక్షించే భక్తులకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు పెట్టి సెక్టార్లవారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా 75 శాతం టికెట్లు కేటాయించాలని, 25 శాతం మ్యానువల్‌గా అందుబాటులో ఉంచాలని దేవస్థానం ఈవోకు సూచించారు. మహోత్సవాల నేపథ్యంలో పట్టణ పరిశుభ్రత కోసం సిబ్బందిని నియమించాలని, విధుల్లో ఉండే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు.
భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు ఈ నెల 31లోగా పూర్తయ్యేలా చూడాలని, మిథిలా స్టేడియం పరిసరాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలు, ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గోదావరి స్నానఘట్టాల వద్ద నాటు పడవలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఉండాలని, పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా 20 బెడ్లను సిద్ధంగా ఉంచుకోవాలని, 108 వాహనంతోపాటు సరిపడా మందులు, సీపీఆర్ చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారుల సమక్షంలో కలెక్టర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవోలు దామోదర్‌రావు, మధుసూదన్, జిల్లా ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.