భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (నమస్తే తెలంగాణ) : భూభారతి చట్టం కింద ఆన్లైన్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులు, రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పెండింగ్ ఎలక్షన్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా భూభారతి దరఖాస్తులు 1,679 వరకు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వాటి వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని, ఏ స్థాయిలో ఎన్ని రోజులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే వివరాలు తెలియపర్చాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ నూతన ఆర్వోఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు.
కొత్త రేషన్ కార్డులు, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను జతపర్చడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తరలించడానికి ఎన్ని లారీలు అవసరమవుతాయో అంచనా వేసుకొని లోడింగ్ చేసేందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎన్నికల దరఖాస్తు ఫారం 6,7,8లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.