భద్రాచలం, నవంబర్ 5 : రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు ఎలా సాధిస్తారో.. ఆరోగ్యంగా పది కాలాలపాటు జీవించాలంటే సహజంగా లభ్యమయ్యే మట్టితో మనం అందంగా బొమ్మరిల్లు వంటి ఇంటిని నిర్మించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో వైటీసీలో మట్టితో సాంప్రదాయ కట్టడాలు, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చు, పర్యావరణానికి అనుకూలంగా మంచి మన్నిక కలిగిన నిర్మాణాలపై రమ్మెడ్ ఎర్త్ ఫౌండేషన్, సీఎస్బీ పద్ధతులతో అవసరమైన ఇంటి నిర్మాణాల శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలతోపాటు ఇంటి నిర్మాణాలు కూడా తక్కువ పెట్టుబడితో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టితో అందమైన గృహాలు నిర్మించుకుని వాటిలో జీవిస్తే ఎలాంటి రోగాలు దరి చేరవన్నారు. ఇళ్లు, మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఇలా.. ప్రతీది ఇష్టమైన రీతిలో నిర్మించుకోవచ్చని, వీటికి ఖర్చు కూడా ఎక్కువగా ఉండదన్నారు.
పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో ఎక్కువగా మట్టితో కట్టిన ఇళ్లే దర్శనమిస్తాయన్నారు. ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే సిమెంటు, ఇసుకను తగ్గించి.. సహజంగా లభ్యమయ్యే మట్టి, రాళ్లు కలిపి సమపాళ్లలో ఇటుకలు తయారు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఇటుకలు ఏ విధంగా తయారు చేయాలో ప్రయోగాత్మకంగా శిక్షకులు తయారు చేసి చూపించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, శిక్షకుడు సుధాకర్, ఏఈలు, డీఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.