కారేపల్లి, ఏప్రిల్ 10 : పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ కారేపల్లి, కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం పేదలపై పన్నుల భారం మోపుతూ సంపన్నులకు రాయితీలు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల పొట్ట కొట్టడం తప్పా పేదలను ఆదుకున్నది లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశానికి అచ్చే దిన్ ఆయేగా అన్నాడు, కానీ పేదల నడ్డి విరిచే విధంగా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతున్నట్లు దుయ్యబట్టారు.
పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.శిరోమణి మాట్లాడుతూ.. దేశంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కార్మికులకు కనీస వేతనాలు లేవు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, ఇవన్నీ సమకూర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంస్థలను అప్పగించి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందన్నారు. ఇప్పటికైనా పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ మండల సహాయ కార్యదర్శి తేలే రాకేశ్, నాయకులు ధరావత్ సక్రు, బిక్కసాని భాస్కర్, గుమ్మడి సరోజిని, గుమ్మడి ఎర్రయ్య, మూతి ప్రకాశ్, పాయం ఆదిలక్ష్మి, పాయం రవి, గుమ్మడి రవి పాల్గొన్నారు.