ముదిగొండ, ఆగస్టు 4: కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఇటీవల ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు చేపడతామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందని, ముఖ్యంగా ఈ అంశం ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిందని గుర్తు చేశారు. అయితే అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, పలు సభలు, సమావేశాల్లో నిరుద్యోగులను కించపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ హేళన చేయడం సరికాదన్నారు.
ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తీవ్రంగా కలత చెందిన వేణుకుమార్.. ఎంత చదివినా ఉద్యోగం రాదనే ఆందోళనతోపాటు వయసు పైబడుతుండటం, ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడం, కుటుంబ భారం తనపైనే పడటంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్.. తాను ఈ పరిస్థితికి రావడానికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎంలకు తాను రాసిన సూసైడ్ లెటర్ అందేలా చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, వేణుకుమార్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, పోట్ల ప్రసాద్, బంకా మల్లయ్య, తోట ధర్మారావు, కోటేశ్ యాదవ్, షేక్ ఖాజా, కొమ్మూరి రమేశ్, ఎండీ ఖాసీం బాబు, నాగార్జున, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.