బూర్గంపహాడ్, జనవరి 29 : నిబద్ధత, నిజాయితీతో కార్మికుల సంక్షేమానికి పాటుపడేది, వారి పక్షాన నిలిచేది బీఆర్టీయూ మాత్రమేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సారపాక ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో గుర్తింపు ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని, ఈ ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాల ‘బాణం’ గుర్తు దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఐటీసీ గేట్ వద్ద జరిగిన బీఆర్టీయూ మిత్రపక్షాల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాంబాబు, ఆలిండియా సీఐటీయూ కార్యదర్శి ఎం.సాయిబాబు, ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
గత 13 ఒప్పందాల్లో ఆ రెండు యూనియన్లు కార్మికులకు చేసింది ఏమీలేదని, కార్మికుల సంక్షేమాన్ని వదిలి కాంట్రాక్టులు దక్కించుకొని ఆస్తులు కూడబెట్టుకున్నాయని ఆరోపించారు. ఈసారి జరిగే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఆలోచించి బీఆర్టీయూ మిత్రపక్షాల గెలుపు కోసం ఓటు వేయాలన్నారు. బీఆర్టీయూ మిత్రపక్షాలు 14వ వేతన ఒప్పందం కోసం 14 అంశాలను మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టి భవిష్యత్ తరాల తలరాతలు మార్చే విజయం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాంబాబు మాట్లాడుతూ కార్మికుల శ్రమను ఐటీసీ యాజమాన్యం దోచుకుంటున్నదని ఆరోపించారు. గత యూనియన్లు కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి, యాజమాన్యంతో కలిసి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆలిండియా సీఐటీయూ కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ 45 ఏళ్లుగా పనిచేసిన ఆ రెండు యూనియన్లు 13 వేతన ఒప్పందాల్లో కార్మికులకు చేసింది శూన్యమన్నారు.
తొలుత బీఆర్టీయూ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక, భద్రాచలం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే అజీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.హరినాథ్, సీఐటీయూ అధ్యక్షుడు కె.ప్రవీణ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ఐఈయూ ప్రధాన కార్యదర్శి ఎండి.సాబీర్, ఐఈయూ అధ్యక్షుడు శిక్షావలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్ బాధ్యులు నర్సింహారావు, డి.ప్రశాంత్, బహుజన నాయకులు మధుమహరాజ్, శ్రీపాద రవికుమార్, గద్దల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్, బెజ్జంకి కనకాచారి, బొల్లు సాంబ పాల్గొన్నారు.