ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ తీరు, ఓటర్ల నుంచి వచ్చిన స్పందనను బట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్నిచోట్ల పోలింగ్ సమయానికంటే ముందే ముగిసింది. ఖమ్మం జిల్లాలో దాదాపు 80 శాతం, భద్రాద్రి జిల్లాలో 78.66 శాతం వరకు పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ను ముగించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటింగ్ పూర్తయ్యాక భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను ఖమ్మం రూరల్ మండలం శ్రీచైతన్య కళాశాలకు తరలించి స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలను పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
ఖమ్మం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గురువారం పోటెత్తారు. 10 నియోజకవర్గాల్లో ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. పోలింగ్ తీరు, ఓటర్ల స్పందన వంటివి బీఆర్ఎస్ విజయానికి సూచికగా ఉంటున్నాయని ఆ పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ రాత్రి 9:30 గంటల వరకు కొనసాగింది. ఈవీఎంలు కొన్ని చోట్ల నిదానంగా పనిచేయడం, మరికొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ సమయానికి ముందే బారులు తీరడంతో రాత్రి వరకు అధికారులు పోలింగ్‌ను నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. భద్రాద్రి జిల్లా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. కానీ ఆ సమయంలోపు క్యూలో ఉన్న వారిని పోలింగ్‌కు అనుమతించారు. పోలింగ్ ముగిసిన చోట ఈవీఎం బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.
ఖమ్మం జిల్లాలో 83.28 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడి 5 నియోజకవర్గాల్లోని 1,456 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను భారీ బందోబుస్తు మధ్య ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీచైతన్య కళాశాలకు తరలించారు. అక్కడి కౌంటింగ్ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూముల్లో సాయుధ భద్రతా దళాల పహారా మధ్య భద్రపరిచారు. కొత్తగూడెం జిల్లాలోని ఈవీఎంలను పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కాగా, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట, చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నపోపతి, లక్ష్మీపురం, గుండ్రాతిమడుగు గ్రామాల్లో ఉదయం కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించారు. అదే మండలం పల్లిపాడులో ఏపీవో కంట్రోల్ యూనిట్ స్టార్ట్ బటన్‌కు బదులు పొరపాటున క్లోజ్ బటన్ నొక్కడంతో 150కి పైగా ఓట్లు వేసి తరువాత యూనిట్ గంటపాలు ఫ్రీజ్ అయింది. అంతసేపూ అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మరో యూనిట్‌ను తెప్పించి పోలింగ్‌కు కొనసాగించారు.
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు తనను అడ్డుకున్నారంటూ, దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు తనతో వాగ్వాదానికి దిగడానికి అవకాశం కల్పించారంటూ పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, కందాళ ఉపేందర్‌రెడ్డి, మదన్‌లాల్, లింగాల కమల్‌రాజ్, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారవు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ఇతర ప్రముఖులైన ప్రజాప్రతినిధులు, అధికారులు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, తాతా మధు, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక, సీపీ విష్ణు వారియర్, ఎస్పీ వినీత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రానికి వచ్చిన సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్లు పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పలు బూత్‌లతో జరుగుతున్న ఓటింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. కాగా, రెండు జిల్లాల్లోనూ ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వృద్ధులు, మహిళలతో తొలిసారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ప్రక్రియను పర్యవేక్షించారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత తొలిసారిగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 75.76 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2018లో 81.19 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా78.66 శాతం పోలింగ్ నమోదైంది.నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఉంది.