ఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలింగించాలని ఖమ్మం బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సదరు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద వీసీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఖమ్మానికి తలమానికంగా ఉంది. అయితే, పీవీ విగ్రహ ప్రాంగణంలో కొత్త కట్టడ నిర్మాణం జరుగుతుండడంతో విషయం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘం నేతలు ఆ శుక్రవారం ప్రాంతాన్ని పరిశీలించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి మంత్రి పదవి చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అభిమాన సంఘం బాధ్యులు ఇదే పీవీ విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను చూసి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆక్షేపించారు. విషయాన్ని వీపీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కూడా స్పందించి ఖమ్మం కలెక్టర్‌కు ఫోన్ చేశారు. దేశ నేతల విగ్రహాల ప్రాంగణంలో మరే ఇతర కట్టడాలను నిర్మించడం సంప్రదాయం కాదని, ఎక్కడా ఇలా జరగలేదని అన్నారు. తక్షణమే దీనిని తొలగించాలని కోరారు. ఇదే విషయంపై బ్రహ్మణ సంఘం నాయకులు వెళ్లి కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.