ఊరూరా శ్రావణ మాస బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి వద్ద అలంకరించిన బోనాలను మహిళలు గ్రామ దేవత ముత్యాలమ్మకు సమర్పించేందుకు డప్పు చప్పుళ్లతో బయలుదేరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి భక్తిభావాన్ని చాటుకున్నారు. పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.
నమస్తే నెట్వర్క్ : పల్లెల్లో శ్రావణ మాస బోనాల సందడి షురువైంది. ఆదివారం ఉదయం ఇంటి వద్ద బోనం తయారు చేసిన మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం పసుపు, కుంకుమ, పూలు, మామిడి ఆకులతో అలంకరించిన బోనం కుండను తలపై పెట్టుకొని మేళతాళాలు.. సాంప్రదాయ నృత్యాల నడుమ గ్రామ దేవతలకు సమర్పించేందుకు బైలెల్లారు. గ్రామ దేవత ముత్యాలమ్మకు బోనం నైవేద్యంగా సమర్పించి భక్తిభావంతో మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలను చల్లంగ చూడు తల్లీ అంటూ వేడుకున్నారు.