అశ్వారావుపేట, జనవరి 16 : ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభతో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం ఖాయమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ సభ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను విస్మరించి కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నదని, తెలంగాణ రాష్ర్టానికి కూడా తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ప్రజలు అన్నివిధాలా విధ్వంసానికి గురవుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని వివరించారు. 14 ఏళ్లపాటు ఉవ్వెత్తున ఉద్యమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, అన్నిరంగాల్లో వెనుకబడిన రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడుపుతూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఆయన ఉన్నతికి కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రజా, రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, అటువంటి మహానేతకు అన్నివర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. సీతారామ ప్రాజెక్టుతో 10లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని, అశ్వారావుపేట నియోజకవర్గం ఆయిల్‌పాం సాగుకు అడ్రస్సుగా నిలుస్తున్నదని, మన ఫ్యాక్టరీలో వచ్చిన ఓఈఆర్తోనే దేశంలోని ఆయిల్‌పాం గెలల ధర పెరిగిందని చెప్పారు. ఆయిల్‌పాం రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని లక్ష్యంగా సాగును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. తెలంగాణపాటు దేశ ప్రజలు కూడా ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. 18వ తేదీ బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, నియోజకవర్గ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, మండల నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
బంగారు తెలంగాణ నిర్మాణంలో సత్ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్ భారత ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సంకల్పించారని, అందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. పార్టీ మొదటి బహిరంగ సభను ఢిల్లీలో పెట్టాలని సీఎం కేసీఆర్ అనుకున్నారని, కానీ జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడగడంతో ఖమ్మంలో నిర్వహించేందుకు అంగీకరించాలని, ఆయనకు జిల్లా పార్టీ శ్రేణులు, ప్రజలు అండగా ఉంటారని భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. అతితక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని కోరారు.
– ఎంపీ నామా నాగేశ్వరరావు
బీఆర్ఎస్ సభ వైపు.. దేశప్రజల చూపు
దేశ ప్రజలందరూ ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన అతి గొప్ప గౌరవం అని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 5లక్షల మంది జన సమీకరణకు అంచనా వేశామని, కానీ ప్రజల ఉత్సాహం చూస్తుంటే 7లక్షలకు పైగా హాజరుకానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభతో దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని, నియోజకవర్గం నుంచి ప్రజలందరూ బహిరంగ సభకు హాజరై కేసీఆర్ ఉన్నత ఆలోచనలకు అండగా నిలవాలని కోరారు. – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
ఖమ్మం సభకు భారీగా తరలిరావాలి
నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశప్రజల భవిష్యత్ కోసం బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, అటువంటి మహోన్నత వ్యక్తి ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ రాజకీయాల్లో కూడా ప్రజలు, రైతులు తోడ్పాటుగా నిలవాలని కోరారు. ప్రతి మండలం నుంచి బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. – ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు