కూసుమంచి (నేలకొండపల్లి), ఏప్రిల్ 18: రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ అన్నారు. గ్రామాల్లో చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాదారం, కొత్త కొత్తూరు గ్రామాల్లో చేపట్టిన రెవెన్యూ సదస్సులను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు.
సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్ట్రార్లు దరఖాస్తుదారులకు ఇస్తున్న రశీదు, ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ అభద్రతా భావానికి తావీయకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు ఇందులో పరిష్కారం లభిస్తుందన్నారు.
తప్పుల సవరణకు హక్కులు ఉండి.. రికార్డులలో లేనివారు హక్కుల రికార్డులలో నమోదు చేసుకోవడానికి కొత్త చట్టం వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చెరువుమాదారంలో చేపట్టిన సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 160, కొత్త కొత్తూరు గ్రామంలో 28 దరఖాస్తులు స్వీకరించి రైతులకు రశీదులు అందజేశారు. అలాగే సదాశివపురంలో నిర్వహించిన సదస్సులో 46 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, అఫ్జల్ హుస్సేన్, నయాబ్ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐలు శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.