కూసుమంచి రూరల్, డిసెంబర్ 13 : చలికాలంలో పాములు ఎక్కువగా బయట సంచరిస్తాయి.. రాత్రివేళల్లో కూడా ఆహారం కోసం తిరుగుతుంటాయి. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పల్లె ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాముల్లో 15శాతం మాత్రమే విషపూరితమైనవి. దేశంలో 5జాతుల పాములు విషపూరితమైనవిగా గుర్తించారు. ఇవి కాటేస్తే మూడు గంటల్లో మరణించే అవకాశం ఉంది. ఈలోపే బాధితుడికి వైద్యం అందించి, కాపాడాలి.
కాటును బట్టి పామును గుర్తించవచ్చు : కాటేసిన పాము విషపూరితమైందా, కాదా అనేది కాటును బట్టి గుర్తించవచ్చు. విషసర్పమా, కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాత తగు జాగ్రత్తలతో బాధితుడిని వైద్యానికి తరలించాలి. విషసర్పం కాటేస్తే శరీరంపై రెండు గాట్లు పడతాయి. విషంలేని పాము కరిచిన చోట మూడు కంటే ఎక్కువ గాట్లు ఉంటాయి.
విష సర్పం కాటేస్తే.. : విషపూరిత సర్పం కాటేసిన వెంటనే కరిచిన చోటు నుంచి విషం రక్తనాళాల ద్వారా గుండెకు వెళ్తుంది. అక్కడ నుంచి అన్ని శరీరభాగాలకు వెళ్తుంది. అన్ని శరీరభాగాలకు వెళ్లడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఆ వెంటనే శరీరమంతా విషపూరితంగా మారి బాధితులు మరణిస్తారు. ఈలోపే రోగికి ప్రాథమిక చికిత్స అనంతరం సాధ్యమైనంత త్వరగా వైద్యానికి తరలించాలి.
ప్రాథమిక చికిత్స ఇలా…
మొదట బాధితుడికి ధైర్యం చెప్పడం ప్రధానం. పాము కాటేసిన ప్రాంతానికి పైన గుండెవైపు రక్త ప్రసరణ జరగకుండా తాడుతో గట్టిగా కట్టాలి. పాము కరచిన గాట్ల వద్ద సూదిలేని చిరంజితో రక్తాన్ని బయటకు తీయాలి. విషం కలిసిన రక్తం నల్లగా వస్తుంది. బాధితుడికి ధైర్యం చెపుతూ ఇలా రెండు మూడు సార్లు తీస్తుండాలి. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలి.
పాముల విష ప్రభావం..
కట్లపాము : ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. వెంటనే అందుబాటులో ఉన్న దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి.
నాగుపాము : ఇది కాటువేసిన 15 నిమిషాలలోనే శరీరంలోకి విషం ఎక్కుతుంది.
రక్తపింజర : ఇది కాటు వేసిన 2గంటల తర్వాత విషం శరీరంలో కలిసిపోతుంది.
జెర్రిపోతు, నీరుకట్టు పాము : ఇవి కాటువేసిన విషం ఉండదు. కానీ కాటు వేసిన వెంటనే దవాఖానకు తీసుకువెళ్లి చికిత్స చేయించడం ఉత్తమం.
అందుబాటులో వైద్యం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పాముకాటు వైద్యం అందుబాటులోకి వచ్చింది. సీమాంధ్రుల పాలనలో మందులు అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం రూ.50 వేల విలువైన మందులన్నీ రోగికి ఉచితంగా అందించి, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. ఫలితంగా గత ఏడేళ్లలో పాముకాటు మరణాలు గణనీయంగా తగ్గాయి.
ఆందోళన చెందొద్దు..
ప్రధానంగా పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందవద్దు. పక్కన ఉన్న వారు వారికి ధైర్యం చెప్పి, కాటుకు గురైన శరీరభాగానికి పైన తాడు కట్టి రక్తప్రసరణ నిలిపివేయాలి. త్రాచు, రక్తపింజర, కట్లపాము వంటి మూడు, నాలుగు రకాల పాములే విషపూరితమైనవి. తాచుపాము విషం వల్ల మొదడుకు ప్రమాదకరం. రక్తపింజర కాటువల్ల రక్తం గడ్డ కట్టి, రక్తం వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి. కట్లపాటు కాటుకు వాపులు, కండ్లు తిరుగడు, శరీరం నల్లబడడం జరుగుతుంది.
– నారగోని రామ్‌ప్రసాద్, ప్రభుత్వ వైద్యుడు, ఖమ్మం
సొంత వైద్యం చేయవద్దు
గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు గురైన వ్యక్తికి నాటువైద్యం, మంత్రాలు వంటివి చేస్తూ కాలయాపన చేయకూడదు. కాటుకు గురైన వారు వృద్ధులైతే తొందరగా విషప్రభావం చూపుతుంది. ఆందోళనకు గురైతే బీపీ పడిపోయి, స్పృహ కోల్పోతారు. 90శాతం పాములు విషపూరితమైనవి కావు. భయం, ఆందోళన చెందకుండా సాధ్యమైనంత తొందరగా సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలి. పాముకాట్లను బట్టి కరిచింది ఏ పామో వైద్యులు గుర్తిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ ఇవాంజిలిన్, కూసుమంచి పీహెచ్సీ
అన్ని పాములు ప్రమాదకరం కాదు..
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. త్రాచు, కట్లపాముల్లో 15శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే విషం ఉంటుంది. సాధారణంగా 50శాతం పాముకాటు విషం ప్రమాదం లేని మామూలు గాయాలే. సాధారణ చికిత్స చేయించకుంటే నయమవుతుంది. పాము వేసే కాటు కన్నా భయాందోళనలతోనే ప్రాణం మీదికి తెచ్చుకుంటారు. ఇంట్లో వారు ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులు వారే ఎక్కువగా భయపెడతారు. అందువలన పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులంటున్నారు. కాబట్టి ధైర్యం చెబుతూ దగ్గరలోని దవాఖానకు తరలించి చికిత్స చేయించాలి.