చండ్రుగొండ, ఏప్రిల్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామ పంచాయతీలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రూ.50 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామస్తులు, మహిళలు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు రూ.50 వేలు ఇస్తేనే అర్హుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనర్హులు 18 మందికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇచ్చారని, దీనిపై ఉన్నతాధికారి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.