కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 12 : సింగరేణిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించడం కోసం ఆయా రంగాలను ఎత్తివేస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని వారిని సింగరేణిలోనే యధావిధిగా కొనసాగించాలని కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రాశుద్దిన్ అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అనేక విభాగాల్లో గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇదే పనిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను తొలగించాల్సి వస్తే ఇతర విభాగాల్లో ఉపాధి కల్పించాలన్నారు.
32 వేలకు పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను మరోపక్క 40 వేల మంది ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికుల్ని తగ్గించుకుంటూ సింగరేణి మొత్తం కూడా తన బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తుందన్నారు. బొగ్గు మీదనే కేంద్రీకరించకుండా వచ్చిన లాభాలను ఇతర రంగాలపై పెట్టుబడి పెట్టడం చేస్తూ ఇక్కడి కార్మికుల్ని నిర్వీర్యం చేస్తూ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని సింగరేణి యాజమాన్యనికి SCCWU-IFTU తెలియజేస్తుందన్నారు. కార్యదర్శి ఏ.వెంకన్న మాట్లాడుతూ.. సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శులు జే.సీతారామయ్య, గౌని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అశోక్, రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీనివాస్, ఎన్.సంజీవ్ పాల్గొన్నారు.