చుంచుపల్లి, జూలై 28 : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, డైట్ బిల్లులు రూ.8,600 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకపోతే సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (డీఎస్ఎఫ్ఐ) జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ తెలిపారు. డీఎస్ఎఫ్ఐ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. తొలుత కెఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుండి నూతన కలెక్టరేట్ కార్యాలయం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజులను విడుదల చేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్ ప్రైవేట్ కళాశాలలు మూతపడుతున్నాయని, యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు లోనవుతుందన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలన్నారు. 5 నెలల కాలంలో పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులు విడుదల చేయాలని, రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖ మంత్రి నియమించాలని, రాష్ట్ర యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు, గురుకులాల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ జరిపించాలని, విద్యార్థుల మరణాలను ఆపాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు బి.వీరభద్రం, కేళోత్ సాయికుమార్, మాలోత్ శాంత్ కుమార్, గుగులోత్ సూర్య ప్రకాశ్, భూక్య శ్రీకాంత్, సీహెచ్ రామచరణ్, గుగులోత్ శివ వర్మ, దేవేందర్, వీరేశ్, దినేశ్, దిలీప్, జవహర్, రమేశ్ పాల్గొన్నారు.