బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారి, ఓ పార్టీ నాయకుడిపై, తాజాగా సారపాక ఉప సర్పంచ్ పై దాడికి యత్నించారు. అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఉప సర్పంచ్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు బ్రిడ్జి సమీపంలోని అనధికార ర్యాంపు ప్రదేశానికి వెళ్లగా ప్రజాప్రతినిధిపై ఇసుక మాఫియా సోమవారం రాత్రి దాడికి యత్నించింది.
సారపాక బ్రిడ్జి సమీపంలోని అనధికార ర్యాంపు నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకుని ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ రాత్రి 11 గంటల సమయంలో అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనతో పాటు కొందరు మీడియా వ్యక్తులు కూడా కవరేజికి వెళ్లగా అప్పటికే ఉప సర్పంచ్ వచ్చిన విషయం తెలుసుకున్న ఇసుక మాఫియా తనపై కత్తులతో దాడికి యత్నించే ప్రయత్నం చేశారు. మీడియా ఉండడాన్ని గమనించి వెనక్కు తగ్గారు. ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు తెలిపేందుకు ఉప సర్పంచ్ ఫోన్లు చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆయన ఆగ్రహానికి గురై పాల్వంచ డీఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించడంతో కొద్దిసేపటికి పోలీసులు వచ్చి అక్రమ రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తనపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా వ్యక్తులపై పోలీసుస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనపై దాడికి యత్నించిన సమయంలో రక్షణ కోసం పోలీసులకు ఫోన్ చేసినా స్పందించ లేదని, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉన్న తాను ఫోన్ చేస్తేనే స్పందించని పోలీసులు సామాన్యులకు ఎలా న్యాయం చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి విషయాన్ని ఎస్పీ దృష్టికి సైతం తీసుకువెళతానన్నారు. ఇదే సారపాక ర్యాంపులో గతంలో ఆర్వోగా పనిచేసిన ముత్తయ్యపై, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓ నాయకుడిపై ఇసుక మాఫియా దాడులకు ప్రయత్నించినట్లు పలు పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఇసుక మాఫియా దాడులు పరాకాష్టకు చేరుతున్నాయని అటు పోలీసు, ఇటు రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

బరితెగించిన ఇసుక మాఫియా.. ఉప సర్పంచ్‌పై దాడికి యత్నం