చండ్రుగొండ, ఏప్రిల్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కాన్వాయ్‌ను గిరిజన (మొక్కజొన్న) రైతులు బుధవారం అడ్డుకున్నారు. పోకలగూడెం గ్రామానికి చెందిన 12 మంది గిరిజన రైతులు 24 ఎకరాల్లో ఓ విత్తన కంపెనీకి చెందిన విత్తనాలను ఈ ఏడాది సాగు చేశారు. విత్తనాలు నకిలీవని తేలడంతో స్థానిక చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బాధిత రైతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. నాటి నుండి నేటి వరకు విత్తన కంపెనీకి సంబంధించిన వారిని పిలవకపోవడం, వారిపై కేసులు నమోదు చేయకపోవడంతో విసుకు చెందిన రైతులు మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణను అడ్డుకున్నారు.
పోలీసులు, అధికార పార్టీ నేతలు గిరిజన రైతులని నెట్టేసేందుకు ప్రయత్నించగా వారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుడు కీసరి కిరణ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. తమ ఆవేదన చెప్పుకునేందుకు వస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ కారు దిగకపోవడం రైతుల ఆగ్రహానికి మరింత ఊతమిచ్చినట్లు అయింది. పోలీసులు రైతులను పక్కకు తరలించి ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అక్కడి నుండి పంపించివేశారు.
Chandrugonda : అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ కాన్వాయ్ అడ్డగింత