భద్రాచలం, ఏప్రిల్ 23 : భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారం అర్దరాత్రి సమయంలో పోలీసులు ఆర్టీసీ ఇన్గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంటును తొలగించారు. గురువారం నాడు డిపో ఇన్గేటు వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు సత్యనారాయణ, భద్రాచలం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ బర్ల మణారావు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మెను కొనసాగిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తమ మద్దతు తీసుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయం మరిచిపోయిందని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే సిబ్బందిని క్రమంగా తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నారని, జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలలో సిబ్బందిపై పని ఒత్తిడి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు.
తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని అన్నారు. గురువారం భద్రాచలం ఆర్టీసీ ప్రాంగణం అంతా ఆంధ్రా బస్సులతో కళకళలాడింది. ప్రయాణీకులు సైతం ఎక్కువగానే కనిపించారు. ప్రయాణీకుల రద్దీని బట్టి మరింతగా బస్సులను పెంచే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులు ఖమ్మం, కొత్తగూడెం, చర్ల మార్గాల్లో 22 అద్దె బస్సులు, 23 ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టు డ్రైవర్లతో నడిపారు. అలాగే కొందరు తాత్కాలిక కండక్టర్లను సైతం విధుల్లోకి తీసుకొని వారితో బస్సుల్లో టికెట్లు కొట్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కేకే ప్రసాద్, యాకయ్య, ఎం.ఎస్.రావు, జున్ను రవి, పోకల సురేష్ పాల్గొన్నారు.