చండ్రుగొండ, జూలై 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో నకిలీ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. చండ్రుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల అయ్యన్నపాలెం గ్రామంలో 2018లో వివాహం జరిగిన ఓ జంట 2025లో వివాహం జరిగినట్లు ఆధారాలు, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కల్యాణ లక్ష్మి పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఆడ, మగ కలరు. కల్యాణలక్ష్మి పథకం వచ్చేలా ఓ ప్రజాప్రతినిధి భర్త (ఉపాధ్యాయుడు), నెట్ సెంటర్ నిర్వహికుడు కలిసి ఆ జంటకు తాము కల్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తామని తమకు కొంత డబ్బు ఇవ్వాలని బేరాలు కుదుర్చుకుని, రూ.40 వేలు ఆ జంట దగ్గర నుండి నగదు రూపేనా తీసుకున్నట్లు అధికారుల ఎదుట ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలో సైతం ఇలా నకిలీ పత్రాలు పెట్టి కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి భర్త పూర్తిగా సహాయ, సహకారాలు అందించడం విశేషం. బదిలీపై వెళ్లిన గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకం, ఇతర అధికారుల సంతకాలు, నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై చండ్రుగొండ తాసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ ను వివరణ కోరగా ఇప్పటికే రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారని, పూర్తి విషయాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.