– 8 కిలోల కాంప్లెక్స్ ఓవేరియన్ ట్యూమర్ తొలగింపు
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 19 : సింగరేణి ప్రధాన హాస్పిటల్, కొత్తగూడెంలోని వైద్యుల బృందం 65 ఏళ్ల మహిళకు 8 కిలోల కాంప్లెక్స్ ఓవేరియన్ ట్యూమర్ ను విజయవంతంగా తొలగించింది. రోగి అనేక ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తిరిగి ఎక్కడా కూడా శస్త్ర చికిత్స చేయడం క్లిష్టం అని తెలిపిన పిమ్మట సింగరేణి ప్రధాన ఆస్పత్రికి రావడం జరిగింది. ఈ శస్త్రచికిత్సను సింగరేణి ప్రధాన ఆస్పత్రి బృందం శుక్రవారం కంబైన్డ్ స్పైనల్, ఎపిడ్యూరల్ అనస్థీషియా కింద నిర్వహించింది. రోగి హైపర్ టెన్షన్, అనీమియా ఇతర కో-మోర్బిడిటీలతో ఆస్పత్రికి రాగా వైద్యుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.
ఈ నెల 12న కూడా ఇదే ఆస్పత్రిలో ఇలాంటి కాంప్లెక్స్ ఓవేరియన్ ట్యూమర్ కేసు విజయవంతంగా పూర్తి చేశారు. వరుసగా రెండు ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా సింగరేణి మెయిన్ హాస్పిటల్ వైద్యుల నైపుణ్యం, అత్యాధునిక వైద్య సదుపాయాలు మరొక్కసారి నిరూపితమయ్యాయి. ఈ శస్త్రచికిత్సలో గైనకాలజీ, అనస్థీషియా, నర్సింగ్, పారామెడికల్ బృందాలు సమన్వయంతో పనిచేశాయి. సింగరేణి ప్రధాన ఆస్పత్రి గైనకాలజిస్ట్ మాలతి, జనరల్ సర్జన్ వినూత్న, అనస్థియా వైద్యులు కాళేశ్వర్, కృష్ణమూర్తి, రవళి పాల్గొన్నారు.సర్జరీలో పాల్గొన్న వైద్య సిబ్బందిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉష అభినందించారు.