చుంచుపల్లి, మే 29 : అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కొత్తగూడెం సహకార సంఘం చైర్మన్ మండే వీర హనుమంతరావు అన్నారు. శుక్రవారం సుజాతనగర్ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో తెలుసుకున్నారు. ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను సొసైటీ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కొత్తగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం 10 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 21,968 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.5 కోట్ల 20 లక్షలు ఉంటుందని చెప్పారు. అలాగే రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా 5,380 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. దీని విలువ దాదాపు రూ.12 కోట్ల 80 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులెవరూ అధైర్య పడొద్దు : మండే వీర హనుమంతరావు