కొత్తగూడెం ఆర్బన్, జూలై 22 : ప్రతీ క్షణం కొత్తగూడెం ప్రాంతాభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ‘మహిళా శక్తి సంబురాలు’ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా, బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నట్లు, హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాజీపడబోనని తెలిపార. ప్రతీ మహిళకు సంక్షేమం, ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అమలు చేసే పథకం అందేలాగా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, అదనపు డీఆర్డీఓ నీలేశ్, మెప్మా డీఎంసీ రాజేశ్, ఏడీఎంసీ చంద్రశేఖర్, సెర్ప్ ఏపీఎంలు, ఓబీలు, గ్రామ దీపికలు, మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొన్నారు.
సమావేశ ప్రాంగణం ఆవరణంలో మహిళలకు ఏర్పాటు చేసిన భోజనాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్నం, కూరలు వడ్డించేవారు లేక, డీఆర్డీఓ సిబ్బంది సరైన ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు భోజనాల కోసం మహిళలు ఇబ్బందులు పడుతుంటే, అధికారులు, సిబ్బంది వేదికపై ఫొటోలు దిగేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Kothagudem Urban : కొత్తగూడెం అభివృద్ధికి నిరంతరం కృషి : ఎమ్మెల్యే కూనంనేని