కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 6 : (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (BKCA)కి చెందిన ముగ్గురు ప్రతిభావంతులైన క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికై జిల్లా స్థాయిలో సత్తా చాటారు. కే. మేఘ శర్వాన్ (SR Digi School), పి. జై గణేష్ రెడ్డి (Sri Chaitanya School), ఎ. సాయి సాకేత్ (Nalanda Junior College) లు తమ ప్రతిభను ప్రదర్శించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
సోమవారం నుండి ప్రారంభం కానున్న టోర్నమెంట్లో వీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. జిల్లా స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించడం పట్ల BKCA కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. BKCA కోచ్ పంతంగి సాయి నిరంజన్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిరంతర సాధన, కష్టపడే తత్వంతో క్రీడాకారులు ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.