ఇల్లెందు, అక్టోబర్ 21 : గత నలభై రోజులుగా వారికి వచ్చే వేతనాల్లో సగానికి తగ్గించి ఇస్తామని జీఓ రిలీజ్ చేసిన ప్రభుత్వంపై నిరసనగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లను పండగ రోజు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో నిర్బంధించడం సరికాదని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ అన్నారు. గత 20 సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న కార్మికులను దీపావళి పండగ రోజున ఇల్లెందు పోలీసులు స్టేషన్లో నిర్బంధించి, పండగపూట ఇబ్బంది పెట్టడం సరికాదని, వారి న్యాయమైన సమస్యలను తీర్చాలన్నారు. నిరవధిక సమ్మె 40 రోజుల నుంచి చేస్తున్నా ప్రభుత్వం కానీ, ఐటీడీఏ అధికారులు కానీ పట్టించుకోకపోవడం సరికాదని వెంటనే వారి న్యాయమైన కోరికను తీర్చాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో నాగేశ్వరరావు, స్వామి, రామకల, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, నగేష్, ప్రసాద్, వినోద్ ఉన్నారు.