రఘునాథపాలెం, ఆగస్టు 22 : కాంగ్రెస్ సర్కార్‌పై ఆటోడ్రైవర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కదం తొక్కనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు ఖమ్మంజిల్లాలోని ఆటో క్యాబ్ డ్రైవర్లు బంద్ పాటించనున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సర్కార్‌పై పోరాటం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఖమ్మంజిల్లా రవాణాశాఖ ఇన్చార్జి అధికారి జేఎన్ శ్రీనివాసరావుకు సమ్మె నోటీసును అందజేశారు. మహాలక్ష్మి పథకంతో గిరాకీలు తగ్గి ఆటోడ్రైవర్ల పరిస్థితి ఆర్థికంగా దిగజారి, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2వందల మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆందోళన చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని, రూ.8 వేలుగా ఉన్న ఇన్సూరెన్స్‌ను రూ.వెయ్యికి తగ్గించాలని, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్లతో బంద్‌ను పాటించనున్నారు. ఈ బంద్‌లో బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి ఆటో కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు హెచ్చరించారు.