కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 10 : వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి రాష్ర్టాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జీఎం పర్సనల్, వేడుకల కన్వీనర్ బసవయ్య అన్నారు. ఈ నెల 23వ తేదీన ఉదయం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ అధికారులకు శనివారం జరిగిన సమావేశంలో సూచించారు. ముందుగా సింగరేణి పతాకావిష్కరణ, అనంతరం సింగరేణిలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాల్స్ ప్రారంభోత్సవం, ఎస్బీఐ, ఎల్ఐసీ, బ్రహ్మకుమారీస్, ఫుడ్‌కోర్టు స్టాల్స్ ఉంటాయని తెలిపారు.
వేడుకలకు సింగరేణీయులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతవాసులు భారీ సంఖ్యలో హాజరవుతారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జీఎం ఐటీ రాంకుమార్ ఏజీఎం సేఫ్టీ కేజీ తివారి, ఏజీఎం ఈఅండ్ఎం రఘుకుమార్, డీజీఎం పర్సనల్ జీవీ కిరణ్‌కుమార్, డీజీఎం ఈఅండ్ఎం రాజీవ్‌కుమార్, వేణుమాధవ్, సునిత, వి.తిరుపతి పాల్గొన్నారు.
కారుణ్య నియామక పత్రాలు అందజేత
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు సాధించిన వారు నిజాయతీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలని జీఎం పర్సనల్ కే.బసవయ్య అన్నారు. కార్పొరేట్ ఏరియా నుంచి కారుణ్య నియామకాల కోసం మెడికల్ ఇన్వాలిడేట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామకాల ఉత్తర్వులను హెడ్డాఫీస్‌లోని తన చాంబర్లో శనివారం ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల్లో భాగంగా ముగ్గురికి నియామక పత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హన్మంతరావు, డీజీఎం పర్సనల్ కే.శ్రీనివాసరావు, డీవైపీఎం ముకుంద సత్యనారాయణ, సీనియర్ పీవోలు సుశీల్‌కుమార్, వెల్ఫేర్ పీఏ వరప్రసాద్, అజీజ్ పాల్గొన్నారు.