ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా పనిచేస్తున్న ముజమ్మిల్ ఖాన్ రాష్ట్ర సివిల్ సప్లయీస్ డైరెక్టర్‌గా, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం జూన్‌లో పెద్దపల్లి జిల్లా నుంచి బదిలీపై ఖమ్మం కలెక్టర్‌గా వచ్చిన ముజమ్మిల్ ఖాన్.. ఏడాదిపాటు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
ఈ కాలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారన్న పేరొందారు. క్షేత్రస్థాయిలో పర్యటనలను నిరంతరం చేయడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేయడానికి ప్రయత్నించారు. ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని, వారిని ఆకాశమంత ఎదగనివ్వాలని ఆకాంక్షిస్తూ ‘మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కూర్చొని పాఠాలు విన్నారు. కొన్ని కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అనుదీప్ బదిలీపై ఖమ్మం కలెక్టర్‌గా వస్తున్నారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనుదీప్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019, మే 24న భద్రాద్రి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తరువాత అదే జిల్లాలో అదననపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా పనిచేశారు. 2021, జూన్ 1న భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా నియమితులై 2023, జూన్ 15 వరకూ పనిచేశారు. పాలనాపరంగా భద్రాద్రి జిల్లాపై తనదైన ముద్రవేసుకున్నారన్న పేరొందారు.
భద్రాచలంలో వరదల సమయంలో వరద బాధితులకు మెరుగైన సేవలందించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంలో కీలకప్రాత పోషించారు. పాలనాపరమైన అంశాలపై పట్టున్న అధికారిగా, సౌమ్యుడిగా, మితభాషిగా అనుదీప్‌కు పేరుంది. ఆయన ఖమ్మం కలెక్టర్‌గా నియమితులు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఆయనకున్న అనుబంధం పాలనాపరంగా మరింత ఉపయోగపడే అవకాశం ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. భద్రాద్రి కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో సంస్కరణలను చేపట్టడంతోపాటు పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా నూతన మంత్రి వాకిటి శ్రీహరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది.
ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వరంగల్ ఇన్చార్జి మంత్రిగా ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తోంది. కానీ.. నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. తుమ్మల స్థానంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి సంస్థలో కీలకమైన పోస్టుగా భావించే డైరెక్టర్ (పా)గా ఐఏఎస్ అధికారి గౌతమ్ పోట్రును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం ఐటీడీఏ పీవోగా గత సంవత్సరం వరకూ పనిచేసిన గౌతమ్ పోట్రు.. ప్రస్తుతం మేడ్చల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. సింగరేణిలో అత్యంత కీలకమైన డైరెక్టర్ (పా) పోస్టును ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో భర్తీ చేసింది.