గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు శూన్యం
రోజురోజుకూ ధరలు పెంచుతున్న బీజేపీ సర్కార్
మరోవైపు పెట్రో ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు
ఖమ్మం, మార్చి 23: సామాన్యులపై మరో పిడుగు పడింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు మోత మోగుతున్న వేళ.. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను సైతం కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడినట్లయింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.50 పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.110 దాటాయి. మరోవైపు వంట గ్యాస్ ధర రూ.1,000 దాటుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొవిడ్ కారణంగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ఈ ధరల పెంపు మరింత భారం మోపినట్లయింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని జీవించే పేదల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తోంది.
సిలిండర్‌పై రూ.50 భారం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడేళ్లుగా రెండు నెలలకోసారి గ్యాస్ ధరలను పెంచుతూ వస్తోంది. ఇటీవల ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న కారణంగా ఐదు నెలలుగా గ్యాస్ ధరలను పెంచలేదు. ఇటీవలే అవి ముగిసిపోవడంతో మంగళవారం ఒకేసారి రూ.50 పెంచింది. గత ఏడాది ఆగస్టు 1న గ్యాస్ సిలిండర్ ధర రూ 890.50 ఉండగా సెప్టెంబర్ 5న రూ.915.50కి పెంచింది. అదే నెలలో ఒక్క రోజు తేడాతో మరో రూ.15 పెంచింది. దీంతో మొత్తం ధర రూ.930.50కు చేరింది. ప్రస్తుతం రూ.50 పెంచడంతో రూ.980.50కి పెరిగి రూ.1,000కి చేరువలోకి వచ్చేసింది. ఖమ్మం జిల్లాలోని 34 గ్యాస్ ఏజెన్సీల్లో 4,10,404 గ్యాస్ కనెక్షన్లున్నాయి. భద్రాద్రి జిల్లాలోని 25 గ్యాస్ ఏజెన్సీల్లో 2,92,453 గ్యాస్ కనెక్షన్లున్నాయి.
అన్ని వస్తువుల ధరలూ పెంచుతున్నారు..
దేశంలో, రాష్ట్రంలో గానీ బీజేపీకి ఏ ఒక్కరూ ఓటు వేయొద్దు. ఆ పార్టీ ప్రభుత్వం అన్నింటి ధరలను పెంచుతూ సామాన్యులకు తీరని అన్యా యం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వస్తువుల ధరలను పెంచింది. కిలో మంచినూనె ప్యాకెట్ ధర రూ.300 చేసింది. ఇలాంటి ధరలు గతంలో ఎప్పుడూ లేవు. పేద, మధ్య తరగతి ప్రజలను కేంద్రం మోసగిస్తోంది.
–కళావతి, గృహిణి, జలగంనగర్, ఖమ్మం
కేంద్రంలో బీజేపీ వచ్చాకే అధిక ధరలు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత ధరలు లేవు. పప్పు దినుసుల ధరల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వరకూ అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయి. నెల సంపాదనంతా సరుకుల కొనుగోలుకే సరిపోతోంది.
–రెడపంగి రాణి, గృహిణి, ఖమ్మం
పేద, మధ్య తరగతి వాళ్లు బతకలేని పరిస్థితి..
నెల మొత్తం కష్టపడితే కిరాణ సరుకులు కూడా రావడం లేదు. ప్రతి వస్తువు ధర రెట్టింపైంది. దీని వల్ల కూలి పనులు, చిన్న చిన్న పనులు చేసుకొనే వారు ఎలా బతుకుతారు? పిల్లలను ఎలా చదివించుకుంటారు? పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితి. అద్దెలు చెల్లించలేక అప్పులు పాలవుతున్నారు. గ్యాస్ ధరలు ప్రతి నెలా ఎలా పెంచుతారు? ఇవన్నీ పట్టకుండా కేంద్రం ధరలు పెంచుతూనే ఉంది.
–పిట్టల ప్రవీణ, వెంటేశ్వరనగర్, ఖమ్మం