మామిళ్లగూడెం, మార్చి 18 : జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన వారు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఓటరు జాబితా సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటరు జాబితా చాలా ముఖ్యమన్నారు. ఓటరు జాబితా, పారదర్శకమైన పోలింగ్ సిబ్బంది, ఈవీఎం యంత్రాలు, బ్యాలెట్ పేపర్లు ఎన్నికల వ్యవస్థకు కీలకంగా పేర్కొన్నారు.
ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు తొలగించే సమయంలో తప్పక నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు తమ వ్యయ వివరాలు నమోదు చేయలేదని పేర్కొన్నారు. జిల్లాలో 1,459 పోలింగ్ కేంద్రాలకు.. 5,824 బ్యాలెట్ యూనిట్లు, 2,202 కంట్రోల్ యూనిట్లు, 2,218 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నట్లు పార్టీల ప్రతినిధులకు ఆయన తెలియజేశారు. ఓటరు జాబితా సవరణపై సందేహాలు, ఫిర్యాదులు, సూచనలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు సీహెచ్.నాగేశ్వరరావు, జీ విద్యాసాగర్, ఎన్.నాగేశ్వరరావు, గోపాల్‌రావు, లింగనబోయిన సతీశ్, పీటీఆర్ కృష్ణప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.స్వామి, ఎన్నికల డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.