కామేపల్లి/ కల్లూరు/ వైరా టౌన్/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 4: మహిళల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరీక్షల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లోని మహిళలందరూ ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. కామేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించి అక్కడ జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలన్నారు.
కల్లూరు మండలం చెన్నూరు పీహెచ్సీలో జరుగుతున్న ‘ఆరోగ్య మహిళ’ పరీక్షలను డీఆర్డీవో విద్యాచందన పరిశీలించారు. వైరాలోని ప్రభుత్వ వైద్యశాలలో కొనసాగుతున్న ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాన్ని డీడబ్ల్యూవో సంధ్యారాణి సందర్శించారు. తదుపరి వైద్యసేవలు అవసరమైన వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయాలని సూచించారు.
ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటయపాలెం పీహెచ్సీలో కొనసాగుతున్న ఆరోగ్య మహిళ కేంద్రాన్ని డీఎంహెచ్వో డాక్టర్ మాలతి పరశీలించారు. 126 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించామని, వారిలో 56 మందిని జిల్లా వైద్యశాలకు రిఫర్ చేశామని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి వివరించారు.