మధిర, ఫిబ్రవరి 22 : వారబందీ లేకుండా సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేయాలని మధిర డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్రను ఆయకట్టు రైతులు వేడుకున్నారు. చింతకాని మండలం తూటికుంట్ల మేజర్ కాల్వ పరిధిలో నీటి ఎద్దడికి గురైన మొక్కజొన్న పైర్లను వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ తూటికుంట్ల మేజర్ కాల్వ పరిధిలో 1,400 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారని, గింజ దశలో ఉన్న పంటకు సాగునీరు అందకపోవడంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అధికారులకు వివరించారు. కాల్వ పక్కనే ఉన్న రైతులకు నీటిని బంద్ చేసి.. కింది రైతుల కోసం తరలించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏడీఏ విజయచంద్ర మాట్లాడుతూ సాగునీటి అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారబందీలో భాగంగా మరో రెండు రోజుల్లో తూటికుంట్ల మేజర్ కాల్వకు ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో మానస, ఏఈ సంపత్‌కుమార్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
మరో నాలుగు రోజులు పొడిగించాలి
బోనకల్లు, ఫిబ్రవరి 22 : సాగర్ ఆయకట్టు పరిధిలోని సాగు భూములకు వారబందీ ప్రకారం మరో నాలుగు రోజులు నీటి సరఫరాను పొడిగించాలని ఆయకట్టు రైతులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని ఆళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని మొక్కజొన్న నీటి ఎద్దడిని క్షేత్రస్థాయిలో ఆత్మ కమిటీ మధిర నియోజకవర్గ డైరెక్టర్ కందుల పాపారావు, ఏఈవో బంధం రజిత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి నుంచి సాగర్ నీళ్లు ఆళ్లపాడు రెవెన్యూ పరిధిలోని పైర్లకు అందుతుండగా.. మరో రెండు రోజులు మాత్రమే వారబందీ ప్రకారం నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు రోజులు నీటి సరఫరాను పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.