తన బిడ్డ పెద్ద పోలీసాఫీసర్ అయ్యాడని ఆ నేల తల్లి సంబురపడుతున్నది.
మరెందరో బిడ్డలకు ఆదర్శప్రాయుడిగా, స్ఫూర్తిగా నిలిచాడని గర్వపడుతున్నది.
ఆ బిడ్డ.. మోహన్‌కుమార్..! ఆ నేల తల్లి.. పట్వారిగూడెం..!!
దమ్మపేట, ఫిబ్రవరి 9: తమ బిడ్డలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు మురిసిపోతారు. ఆ బిడ్డను ‘మోసిన’ జన్మభూమి (పుట్టిన పల్లె) సంబురపడుతుంది. మోహన్‌కుమార్ ఎదుగుదలను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆ పల్లె తల్లి సంబురపడింది. దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామస్తులు శ్రీరాముల రామకృష్ణారావు-లక్ష్మీపారిజాతం దంపతుల నాల్గవ సంతానమే మోహన్‌కుమార్. ప్రస్తుతం హైదరాబాద్ పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా పనిచేస్తున్న మోహన్‌కుమార్ ప్రస్థానం పట్వారిగూడెంలో మొదలైంది.
ఆయన 7వ తరగతి వరకు పట్వారిగూడెం ప్రాథమిక పాఠశాలలో చదివారు. అశ్వారావుపేటలోని వసతి గృహంలో ఉండి 10వ తరగతి వరకు జిల్లాపరిషత్ పాఠశాలలో చదివారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. అక్కడ చదువుతున్నప్పుడే.. పోలీస్ శాఖలోకి ప్రవేశించాలన్న ఆలోచన చిగురించింది.
ఎస్సైగా ఎంపిక
1995లో తొలిసారిగా ఎస్సై పరీక్ష రాశారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చార్మినార్ ఎస్సైగా విధుల్లో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు వెనక్కు తిరిగి చూడలేదు. ఎస్సైగా శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించడంతో టాస్క్‌ఫోర్స్ సీఐగా, పంజాగుట్ట సీఐగా ఉద్యోగోన్నతి లభించింది. ఉద్యోగ జీవితంలో అనతి కాలంలోనే అనేక విజయాలు సాధించారు. ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న కాలమది. అప్పుడు సూర్యాపేటలో కరోనా కేసులు నమోదయ్యాయి. అలాంటి క్లిష్ట సమయంలో, ఆ ప్రాంతంలో మోహన్‌కుమార్ సేవలు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించినట్లున్నారు. ఆయనను ఉద్యోగోన్నతిపై అక్కడికి డీఎస్పీగా పంపారు. అక్కడ కూడా సమర్థవంతంగానే పనిచేసి అందరి మన్ననలు అందుకున్నారు.
వరించిన పతకాలు
పోలీస్ శాఖలో పతకాలు అనేవి.. సమర్థతకు కొలమానంగా నిలుస్తాయి. మోహన్‌కుమార్ సమర్థతకు గుర్తింపుగా పతకాలు వరించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఎన్ ఇన్విస్టిగేషన్, సేవాపతకం, ఉత్కృష్ట సేవాపతకం, క్యాష్ రివార్డులు, జీఎస్సీ, ఎస్‌ఎస్‌ఈలు కలిపి మొత్తం 516 రివార్డులు దక్కించుకున్నారు.
పంజాగుట్ట ఏసీపీగా..
ఎస్సైగా మొదలై సీఐ, డీఎస్పీ, ఏసీపీగా ఎదిగారు మోహన్‌కుమార్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని పంజాగుట్ట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(ఏసీపీ)గా పనిచేస్తున్నారు. వృత్తి బాధ్యతల్లో ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని, మరెన్నో విజయాలు సాధించాలని మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్వారిగూడెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ‘నా బిడ్డ.. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. విధి నిర్వహణలో సవాళ్లను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నా మిగతా బిడ్డలంతా ఉన్నతికి ఎదిగేలా స్ఫూర్తిప్రదాతగా నిలవాలి’ అంటూ.. ఆ పల్లె తల్లి (పట్వారిగూడెం) అభిలషిస్తున్నది, మోహన్‌కుమార్‌ను దీవిస్తున్నది.