Kothagudem | కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 16: పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ్డి పోచయ్య(70) అన్న కుమారుడికి పుట్టిన కొడుకు పురిటిలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. దీంతో పోచయ్య, లచ్చమ్మ దంపతులు వరుసకు మనువడు అయ్యే ఆ బిడ్డను చేరదీసి చంద్రం అని పేరు పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా పెంచుకున్నారు. చంద్రం గ్యాస్ ఏజెన్సీలో లేబర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో చంద్రం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా భావించిన ఆమె భర్త హరిప్రసాద్ తీవ్ర కోపోద్రేకానికి లోనయ్యాడు. చంద్రం తన భార్యతో నిత్యం ఫోన్లో మాట్లాడడం గమనించాడు. దీంతో హరిప్రసాద్‌కు చంద్రం కనిపించకుండా తిరుగుతున్నాడు. హరిప్రసాద్ వారంరోజులుగా చంద్రం కోసం అతడి ఇంటికి వెళ్లి వాకబు చేస్తూ, అతన్ని పెంచిన పోచయ్య, లచ్చమ్మతో గొడవకు దిగుతున్నాడు.
శనివారం అర్ధరాత్రి కూడా సుమారు 2గంటల సమయంలో మళ్లీ చంద్రం ఇంటికి వెళ్లి సదరు వృద్ధ దంపతులతో వివాదానికి దిగాడు. చంద్రం ఆచూకీ చెప్పమంటూ బూటుకాలితో విచక్షణారహితంగా వారిని తన్నాడు. ఈ దాడిలో లచ్చమ్మ తీవ్రంగా గాయపడగా, పోచ్చయ్య పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు త్రీ టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇన్స్పెక్టర్ ముసుకు అబ్బయ్య, ఎస్సై ముత్తినేని సోమేశ్వర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఉదయం పోచయ్య మృతదేహానికి జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అబ్బయ్య తెలిపారు. నిందితుడు హరిప్రసాద్ పరారీలో ఉన్నాడు.