ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం.. ముచ్చటైన జంట.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. అమెరికాలో భర్తకు మంచి ఉద్యోగం.. నెలకు రూ.లక్షల ఆదాయం.. చేతినిండా డబ్బు.. అనివార్య కారణాలతో స్వస్థలానికి వచ్చారు.. భోగభాగ్యాలతో సంతోషంగా గడుపుతున్నారు.. ఇక అంతా మంచిగా జరుగుతుందన్న సమయంలో భర్త బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.. ఇబ్బడి ముబ్బడిగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు.. జూదమాడాడు.. దీంతో ఆస్తి అంతా కరిగిపోయింది.. కుటుంబం అప్పుల పాలైంది.. రోడ్డున పడింది.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. మరోవైపు సారెగా ఇచ్చిన భూమిని అమ్మి డబ్బు తేవాలని భర్త నుంచి వేధింపులు.. ఇలాంటి పరిస్థితిలో ఏమనుకుందో తెలియదు ఆ భార్య.. ఇద్దరు పిల్లలతో సహ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది.. బిడ్డల కోసమైనా ఒక్క క్షణం ఆలోచించలేదు.. మనసు మార్చుకోలేదు.. ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకింది.. తన ప్రాణాలతోపాటు కడుపున పుట్టిన బిడ్డల ప్రాణాలూ తీసింది..
సత్తుపల్లి రూరల్, మే 9: ఇద్దరు పిల్లలు సహ వివాహిత బలన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో మంగళవారం వెలుగు చూసింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన మృదుల(40)కు 2009లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పాటిబండ్ల ప్రశాంత్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ప్రజ్ఞాన్(8), మహాన్(5). పిల్లలు పుట్టిన తర్వాత ప్రశాంత్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రశాంత్ సంపాదించాడు.
ఏడేళ్ల క్రితం తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్నాడు., షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పుల పాలై సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేశాడు. చేతిలో డబ్బు లేక అత్తవారు ఇచ్చిన భూమిని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించాడు. ఈ మేరకు భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. భూమి అమ్మకం ఆలస్యమవుతుండడంతో భార్య ఒత్తిడికి తాళలేకపోయింది. దీంతో ఆదివారం పిల్లలను తీసుకుని ఏపీలోని విజయవాడలో ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వెళ్తానని బయల్దేరింది. విజయవాడలోని కృష్ణా నదిలో పిల్లలతో కలిసి దూకి చనిపోదామని భావించింది. అక్కడ ఆత్మహత్య చేసుకుంటే తమ శవాలు దొరకవని ఆలోచించి సోమవారం రాత్రి సత్తుపల్లికి వచ్చింది. క్షేమంగా సత్తుపల్లి చేరుకున్నట్లు పెద్దమ్మకు సమాచారం అందించింది. బస్సు దిగిన తర్వాత మృదుల ఇంటికి వెళ్లకుండా ఇద్దరు పిల్లలతో కలిసి పట్టణ శివారులోని తామరచెరువు వద్దకు వెళ్లింది. తన వెంట తెచ్చిన సంచి, సెల్‌ఫోన్, చెప్పులు చెరువు కట్ట వద్ద వదిలి పెద్ద కుమారుడు ప్రజ్ఞాన్ కాలుకు తన చున్నీతో కట్టి, చిన్న కుమారుడు మహాన్‌ను ఎత్తుకుని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
మృదుల ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. అనుమానం వచ్చిన అత్తమామలు మృదుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారితో కలిసి సత్తుపల్లి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు మృదుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తామరచెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు కట్ట వద్ద లభించిన సంచి, సెల్‌ఫోన్, చెప్పులను గుర్తించి అవి మృదులవేనని నిర్ధారించుకున్నారు. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా చెరువులో మృదుల, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను సీఐ కరుణాకర్, ఎస్సై రాము బయటకు తీయించి పంచనామా చేయించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించి కుమార్తె, మనుమల మృతికి కారణమైన ప్రశాంత్‌పై కఠినచర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.