– నిషేధిత భూముల జాబితాలో పేదలు
– రైతులకు అన్ని హక్కులు పునరుద్దించాలి
– తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
కారేపల్లి, సెప్టెంబర్ 21 : పేదలు సాగు చేస్తున్న భూములను నిషేదిత జాబితా ఉండడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. తెలంగాణ రైతు సంఘం బృందం సోమవారం కారేపల్లి మండలంలో 22 ఏ జాబితాలో సాగు భూములు ఉన్న రైతులతో సమావేశాలు నిర్వహించి నిషేధిత భూమిలో ఉన్న సాగు భూమి వివరాలను సేకరించింది. ఈ సందర్భంగాబొంతు రాంబాబు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో 22 ఏ జాబితాను మరింత పెంచి రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుందని విమర్శించారు. రైతులు తమ సాగు భూమికి కనీసం బ్యాంకు రుణాలు పొందలేని పరిస్థితి ఉందన్నారు. తమ వారసులకు భూమి బదిలీ చేయుటకు అవకాశం లేదని, భూమి యాజమాని చనిపోయిన తమ వారుసులకు భూమి హక్కులు బదిలీ చేయుటకు రెవిన్యూ అధికారులు 22 ఏ జాబితాను కారణం చూపుతున్నారని తెలిపారు.
సింగరేణి మండలంలో 22ఏ జాబితాలో రేలకాయలపల్లి రెవిన్యూ పరిధిలో సర్వే నెం.107, మాణిక్యారం రెవిన్యూ గ్రామంలో సర్వే నెం.70, కోమట్లగూడెం రెవిన్యూ గ్రామంలో సర్వే నెం.15 లలో సుమారు 2 వేల ఎకరాలతో పాటు ఇతర గ్రామ రెవిన్యూ పరిధిలో మరికొన్ని సర్వే నెంబర్లకు చెందిన వేయి ఎకరాలు నిషేధిత జాబితాలో ప్రభుత్వం ఉంచిందన్నారు. 22ఏ క్రింది సాగు భూములు ఉండడం వల్ల బ్యాంకులో తీసుకున్న రుణాలు రెన్యూవల్ కాక పోవడంతో పాటు అధిక వడ్డీ తోపాటు పూర్తిగా చెల్లించాలని నోటీసులు పంపిస్తున్నారన్నారు. తక్షణమే 22 ఏ జాబితాలో ఉన్న సాగు భూములను తొలిగించి రైతులకు అని హక్కులు పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కార్యదర్శి దుగ్గి కృష్ణ, కారేపల్లి మండల కార్యదర్శి వజ్జా రామారావు, సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర, మాజీ సర్పంచులు భూక్యా రమణ, బానోతు సక్రామ్, రైతులు పిప్పల కృష్ణ, గణితి సత్యనారాయణ, తారాచంద్, బుడిగ రాజయ్య, శోభన్, భద్రయ్య, నరసింహారావు, వెంకన్న, శంకర్ పాల్గొన్నారు.