భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట, మే 12: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ సామగ్రితో ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆదివారం సందర్శించారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్రాలకు గాను ఇక్కడి రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్రాలకు గాను 1,212 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఇందులో పీవోలు 303 మంది, ఏపీవోలు 303 మంది, ఓపీవోలు 606 మందిని ఉన్నట్లు చెప్పారు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 49 బస్సులను, అదనంగా మరో మూడు బస్సులను సిద్ధంచినట్లు వివరించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేపట్టామన్నారు. ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్య, చుంచుపల్లి డీటీ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు చెప్పారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల మెటేరియల్ అందించామని, వీరంతా పోలీస్ సెక్యూరిటీతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని అన్నారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతా ల్లో నిఘాను మరింత పటిష్టం చేశామని, ఈసీ ఆదేశానుసారం సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్, తహసీల్దార్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.