
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు 4 నామినేషన్లు
టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామపత్రాలఅందజేత
ఎంపీటీసీల సంఘం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు
తాతా మధు నామినేషన్‌కు హాజరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 9వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా.. అదేరోజు నుంచే నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు, కొండపల్లి శ్రీనివాస్‌రావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని భారీ మెజార్టీతో కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నది.
ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం మంగళవారం ముగిసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది. ఆదివారం వరకు అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి తొలుత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చాంబర్ తరఫున ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. చివరిరోజైన మంగళవారం జిల్లాకు చెందిన పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు మరో మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధారాణి ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. దీంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈ నెల 26 వరకూ గడుఉంది. వచ్చే నెల 10న పోలింగ్, 14 లెక్కింపు జరుగనున్నాయి.
ఖమ్మం స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉండడంతో ఓటర్లుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాజేడు, వెంకటాపురం మండలాల ఓటర్లు కొత్తగూడెంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గార్ల, బయ్యారం మండలాల ఓటర్లు ఖమ్మంలో ఓటు వేయనున్నారు. పోలింగ్, కౌంటింగ్, బందోబస్తు ప్రక్రియలకు సంబంధించి కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు, అదనపు కలెక్టర్ మధుసూదన్ కలిసి మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు.
విజయం ఖాయం: మంత్రి
టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం కోసం మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. అభ్యర్థి తాతా మధుసూదన్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను కలిసి తన విజయానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా ఖమ్మం జిల్లాలో విజయం టీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియానాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు పాల్గొన్నారు.
రేపు తుది జాబితా ప్రకటన
మామిళ్లగూడెం, నవంబర్ 23: శాసన మండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరి రోజు టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు మూడు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణి ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు.