
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా
ఎంపీటీసీల కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మంజూరు
ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు సండ్ర, రేగా, కందాళ, హరిప్రియ
ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని, స్థానిక సంస్థల్లో మెజార్టీ ప్రజాప్రతినిధులు కలిగి ఉన్న టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు నామినేషన్ వేసిన అనంతరం ఖమ్మం కలెక్టరేట్ వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని స్పష్టం చేశారు. ఎంపీటీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లను మంజూరు చేసిందని, త్వరలోనే అవి విడుదల కానున్నాయని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవానికి ఇతర పార్టీలు కలిసి రావాలని కోరారు. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ తాతా మధుకు అవకాశం రావడంతో జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని, జిల్లాలో గులాబీ పార్టీ తిరుగులేని శక్తిగా ఉందని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ తాతా మధును గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు మాట్లాడుతూ టీఆర్ఎస్కు పూర్తి బలం ఉన్నందున నామినేషన్ వేసిన రాజకీయ పక్షాలు తమ నామినేషన్లను ఉపసంహరించుకుని జిల్లా అభివృద్ధి దృష్ట్యా ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు.