
ఏన్కూరులో ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల తోటల సాగు
30 కుంటల భూమిలో 30 రకాల పండ్ల మొక్కలు
ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటేశ్వర్లు
ఏన్కూరు, నవంబర్ 22 : ప్రస్తుతం కాయగూరల దగ్గర నుంచి పండ్ల వరకు అన్నింట్లోనూ విపరీతమైన క్రిమిసంహారక, రసాయనిక మందుల వినియోగం అనివార్యమయింది. ప్రజలంతా ఇలాంటి విషపూరితమైన పండ్లు తిని అనారోగ్యం పాలుకావడాన్ని చూసిన ఆ రైతు.. సేంద్రియ పద్ధతికి శ్రీకారం చుట్టాడు. అతడే.. ఏన్కూరు మండలంలోని ఆరికాయలపాడు గ్రామానికి చెందిన రైతు, ఆ ఊరి ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వర్లు. రెండున్నరేళ్ల క్రితం బెంగళూరు, అశ్వారావుపేట, కడియం నర్సరీల నుంచి 30 రకాల 100 పండ్ల మొక్కలను తెచ్చాడు. 30 కుం టల భూమిలో వాటిని పెంచుతున్నాడు. స్వయంగా పశువుల పెంట, గోమూత్రంతో సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన ఎరువులనే తన పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు. ఇప్పటి వరకు తోటకు రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశాడు. ఫెన్సింగ్, సాగునీటి కోసం డ్రిప్ వంటివి ఏర్పాటు చేసుకున్నాడు. ఆవుపేడ, గోమూత్రం, వేపనూనె వంటి వాటి ద్వారా సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నాడు. ఈ తోటలో జామ, తైవాన్ పింక్, ఎర్ర జామ, తీపి చింత, యాపిల్ బేర్, చెర్రీ, బత్తాయి, నిమ్మ, వాటర్ యాపిల్, మామిడి, అరటి, పెద్ద సపోట, పాల సపోట, స్టార్‌ఫ్రూట్, పప్పు ఉసిరి, దానిమ్మ, ఉసిరి, గంగాభవాని గ్రీనికలర్, గంగాభవానీ ఎల్లోకలర్, అల్ల నేరేడు, సీతాఫలం, బొప్పాయి, కలెం, షుగర్‌లెస్ జామ, రేగు, తీపి బ త్తాయి, సపేద జామ, టేకుచెట్లతోపాటు కూరగాయలను కూడా సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం పండ్ల దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ పండ్ల తోటను మార్క్‌ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఇటీవల సందర్శించి రైతును అభినందించారు.
ఇళ్లల్లో, చేలల్లో, అడవుల్లో సహజసిద్ధంగా లభించే పండ్లను, ఫలాలను మార్కెట్లో డబ్బులిచ్చి మరీ కొనుక్కొని తింటున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో బయట మార్కెట్లో కొనుగోలు చేసే కాయలు, పండ్లు సమస్తం విషపూరితమే. అయినా తప్పని పరిస్థితి కావడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా మరో మార్గం లేక తినక తప్పని పరిస్థితి. వీటన్నింటినీ గమనించిన ఓ రైతు సేంద్రియ పద్ధతిలోనే పండ్ల తోటలు సాగు చేయాలని సంకల్పించాడు. కార్యరూపం దాల్చి చూపించాడు. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కాయలను, పండ్లను ప్రజలకు అందిస్తున్నాడు. వారికి ఆరోగ్యాన్ని పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ రైతు గురించి, సేంద్రియ విధానంలో అతడు పండిస్తున్న పంటల గురించే ఈ కథనం.
ఆరోగ్యం కోసమే..
లాభాపేక్షతో కాకుండా ఆరోగ్యం అందించడం కోసమే సేంద్రియ పద్ధతిలో పండ్ల తోటలు పెంచుతున్నాను. స్వయంగా ఆర్గానిక్ ఎరువులను తయారు చేస్తున్నాను. పశువుల పెంట, గోమూత్రం వంటి వాటితో తయారు చేసిన ఎరువునే వినియోగిస్తున్నా. రైతులందరూ పండ్ల తోటలు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించిన వాళ్లము అవుతాం.
-గుడ్ల వెంకటేశ్వర్లు, రైతు, ఆరికాయలపాడు