
మంత్రి పువ్వాడతో కలిసి కలెక్టర్‌కు నామినేషన్ పత్రాల అందజేత
నేటితో ముగియనున్న గడువు
ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్లు దాఖలు
విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మధు..
వివిధ ఎన్నికల్లో ఇన్చార్జ్గా సమర్థంగా బాధ్యతలు
ఖమ్మం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరందుకున్నది. ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేసింది. సోమవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీ ఫారమ్ అందజేశారు. అనంతరం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ వీపీ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే.. సమయం ముగియడంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. మంగళవారం నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కావడంతో తాతా మధు మంత్రి అజయ్‌కుమార్, జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఈయనను పార్టీ ఎంపిక చేసింది. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి అజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు అభ్యర్థి విజయంపై దృష్టిసారించారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు విస్తరించి ఉంది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ కావడంతో తాతా మధు మంత్రి అజయ్‌కుమార్, పార్టీ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ సెట్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, శాసనసభ్యులతో కలిసి మంగళవారం వేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సోమవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తాతా మధుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీ ఫారమ్ అందజేశారు. తాతా మధు అభ్యర్థితత్వాన్ని 10 మంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతిపాదిస్తూ నామినేషన్ ప్రతాలపై సంతకాలు చేశారు. ప్రతిపాదించిన వారిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, శాసనసభ్యుడు రాములునాయక్, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, కార్పొరేటర్లు వలరాజు, రుద్రగాని శ్రీదేవి, దోరేపల్లి శ్వేత, షేక్ మక్బూల్, ముదిగొండ జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమావేణుగోపాల్ ఉన్నారు.
విద్యార్థి నాయకుడిగా..
తాతా మధు.. ఎస్ఎఫ్ఐ, సీపీఎంలో నాయకుడిగా పని చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత టీఆర్ఎస్లో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన పలు ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీకి విజయాలను అందించారు. ప్రధానంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయాల్లో జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం కోసం విశేష కృషి చేశారు. పార్టీ అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తూ.. పార్టీకి విధేయుడిగా ఉండడం వంటి అంశాలు తాతా మధుకు కలిసి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అత్యధిక బలం ఉండడంతో పార్టీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకకానున్నది. టీఆర్ఎస్లో చేరడానికి కొంతకాలం ముందు తాత మధు యూఎస్‌లో ఉన్నారు. అక్కడ తానా అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారు. తానా ద్వారా ఖమ్మం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలూ నిర్వహించారు.
మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్..
ఖమ్మం స్థానంలో మొత్తం 767 ఓట్లకుగాను మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్ పక్షాన స్థానిక సంస్థల నుంచి గెలుపొందినవారే ఉన్నారు. మరికొంత మంది ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఖమ్మం స్థానంలో టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాతా మధు.. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.