మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 14, 2020 , 02:28:31

విశ్వవ్యాప్తం ఆమె రుచులు

విశ్వవ్యాప్తం ఆమె రుచులు

  • n కుగ్రామం నుంచి విదేశాలకు రేపల్లెవాడ పచ్చళ్లు
  • n రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న నల్లమల నిర్మల

ఏన్కూరు: ఆమె పేరు నల్లమల నిర్మల. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామం. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న సంసార సాగరంలో ఒక్కసారిగా మృత్యువనే పెనుతుపాను దూసుకొచ్చింది. ఆ ఇంటి పెద్దను కబళించింది. ఇద్దరు చిన్న పిల్లలతో పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెకు తన తల్లి తోడుగా నిలిచింది. ఆత్మ విశ్వాసాన్ని నింపింది. నడి సంద్రంలో నావలా మారి తన కూతురి కుటుంబానికి చుక్కాని అయింది. ఆమె సహకారంతో నిర్మల నిబ్బరంగా ముందడుగేసింది.

ఆహా.. ఏమి రుచి.. తినరా.. మైమరిచి..!

ఆమె చేతితో తయారైన రకరకాల పచ్చళ్ల రుచి చూసిన వారంతా ఇలాగే అనుకున్నారు. టేస్ట్‌ చూడండంటూ పనిగట్టుకుని పదిమందికీ పరిచయం చేశారు. అలా అలా ఆమె పచ్చళ్లు మారుమూల పల్లె నుంచి దేశ విదేశాలకు వెళ్లాయి. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభమైన ఆమె పచ్చళ్ల తయారీ వ్యాపారం ఇప్పుడు లక్షల్లో టర్నోవర్‌ సాగిస్తున్నది. కష్టాలు-కడగండ్లు చుట్టుముట్టినా నిస్పృహకు లోనవకుండా నిబ్బరంగా నిలిచి, తనలాంటి మరో పదిమందిని నిలబెట్టి, అసామాన్య విజయం సాధించిన ఓ అతి సామాన్యురాలి గెలుపు గాథ ఇది..

అప్పుడెప్పుడో పొందిన శిక్షణ..

అప్పుడెప్పుడో శ్రామిక విద్యాపీఠం ద్వారా పచ్చళ్ల తయారీలో శిక్షణ పొందింది నిర్మల. తన తల్లితోపాటు మొత్తం పదిమంది మహిళలతో కలిసి 1995లో ‘నిర్మల డ్వాక్రా గ్రూపు’ ఏర్పాటు చేసుకుంది. ఐదేళ్ల తరువాత, రూ.10 వేల పెట్టుబడితో 2000 సంవత్సరంలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది.

 రాష్ట్రపతి నుంచి అవార్డు..

అప్పటి గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండే, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రేణుకాచౌదరి, రాంరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితర ప్రముఖులెందరో ఈమె పచ్చళ్లను రుచి చూసి మెచ్చుకున్నారు. 2004లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం నుంచి అవార్డుతోపాటు రూ.75 వేల నగదు ప్రోత్సాహకాన్ని, ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నదీమె.

 విదేశాలకు ఎగుమతి..

ఈమె పచ్చళ్లను విదేశాల్లోని తెలుగు వారు కూడా టేస్ట్‌ చేశారు. చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వస్తున్నాయని, పార్సిళ్లలో పంపిస్తున్నామని చెబుతున్నారు నిర్మల. కేవలం రూ.10 వేల పెట్టుబడితో మొదలైన తమ వ్యాపారం ఇప్పుడు రూ.7 లక్షల టర్నోవర్‌కు చేరిందని గర్వంగా చెబుతున్నారు. ఈమె గ్రూపులోని సభ్యులు కూడా ఒకవైపు పచ్చళ్ల తయారీతోపాటు కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. తాను రేషన్‌ దుకాణం నిర్వహిస్తున్నట్లు నిర్మల వివరించారు. ‘నా భర్త చనిపోగానే.. నాకు భవిష్యత్తంతా శూన్యంగా కనిపించింది. అప్పుడు నాకు, నా ఇద్దరు పిల్లలకు మా అమ్మ అండగా నిలిచింది, మమ్మల్ని మాత్రమే కాదు.. మాతోపాటు మరికొందరిని కూడా నిలబెట్టింది. కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు బెంబేలెత్తవద్దు. ఆత్మవిశ్వాసంతో, గుండె నిబ్బరంతో నిలబడాలి’ అంటూ ధైర్యం చెబుతున్నది ఈ పచ్చళ్ల నిర్మల. 

 కుగ్రామంలో మొదలై..

శుచి, శుభ్రతతోపాటు నోరూరించేలా ఉన్న తమ పచ్చళ్లను ముందుగా చుట్టుపక్కల వాళ్లకు, తమ గ్రామస్తులకు విక్రయించింది ఈ నారీమణి. బాగున్నాయంటూ అందరూ చెప్పడంతో ఆ తరువాత జిల్లావ్యాప్తంగా డ్వాక్రా స్టాళ్లలో అమ్మకానికి పెట్టింది. అనతికాలంలోనే ఆదరణ లభించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. నిర్మల గ్రూపు పచ్చళ్లకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థ్దాయిలో మంచి గుర్తింపు వచ్చింది. 


logo