శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 26, 2020 , 00:42:37

‘అశ్వథ్థామ’ ఓ సందేశాత్మక చిత్రం

‘అశ్వథ్థామ’ ఓ సందేశాత్మక చిత్రం
  • అట్టహాసంగా ‘అశ్వథ్థామ’ ఆడియో విడుదల వేడుక
  • సందేశాత్మక సినిమాలను ఆదరించాలి : మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  • నగరంలో హీరో నాగశౌర్య, హీరోయిన్‌ మెహరిన్‌లతో చిత్రబృందం సందడి

ఖమ్మం కల్చరల్‌, జనవరి 25 : ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మాణ సారథ్యంలో నటుడు నాగశౌర్య హీరోగా, మెహరిన్‌ హీరోయిన్‌గా నటించిన ‘అశ్వథ్థామ’ సినిమా ఆడియో విడుదల వేడుక ఖమ్మంలోని లేక్‌వ్యూక్లబ్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. చిత్ర నటీనటులతో పాటు  దర్శకుడు రమణ తేజ, నిర్మాత ఉషా ముల్పూరి, సంగీత దర్శకుడు చరణ్‌ పాకాల ఇతర  సాంకేతిక బృందం వేడుకలో పాల్గొన్నారు.  ఈ వేడుకలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొని మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై సందేశాత్మకంగా తీసిన సినిమా ‘ అశ్వథ్థామ’ను ఆదరించాలన్నారు. తన తనయుడు నయన్‌కు  నాగశౌర్య స్నేహితుడని, నాగశౌర్య సినిమాలను తాను చూశానని, చాలా సహజంగా నటనలో ఈజ్‌నెస్‌తో నటిస్తాడని అన్నారు. కొత్త ప్రయోగాలతో  నాగశౌర్య సినిమలు తీస్తున్నాడని, అవన్నీ విజయవంతం కావడం మంచి కథ, ప్రయోగమే కారణమన్నారు. ప్రయోగాలే కాకుండా కమర్షియల్‌గా కూడా సినిమాలు తీయాలని సూచించారు. ఖమ్మంకు చెందిన శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ జిల్లాపై అభిమానంతో ఖమ్మంలో సినిమా వేడుకల ఈవెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. అశ్వథ్థామ సినిమా సూపర్‌ హిట్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు.

దర్శకుడు రమణ తేజ,  నటుడు నాగశౌర్యలు ఒక యథార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించడం జరిగిందని, అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని, సందేశాత్మకంగా, వినోదంగా సినిమాను తీయడం జరిగిందన్నారు. ఈ సినిమా  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈ సినిమాలో కొత్త లుక్‌తో నాగశౌర్య  టెరిఫిక్‌ పాత్రలో నటించారని నిర్మాత ఉషా ముల్పూరి అన్నారు. ఈ సినిమా చిత్రీకరణలో  దర్శకుడు రమణతేజ ప్రత్యేక శ్రద్ద కనబర్చారని, చరణ్‌ పాకాల మంచి సంగీతం అందించారని  అన్నారు. కొత్త కథతో ఆద్యంతం ప్రేక్షకులకు ప్రతి ఫ్రేము ఆకట్టుకుంటుందన్నారు. ‘ అశ్వథ్థామ’ టైటిల్‌ సాంగ్‌, నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా, మాహీ...చూస్తుంటే నవ్వులా..అందాల బొమ్మలా... మరో రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు సత్య డ్యాన్స్‌ అకాడమి బృందం నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో లేక్‌వ్యూక్లబ్‌ అధ్యక్షుడు దొడ్డా రవి, శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌, ఖమ్మం ప్రతినిధి నల్లి శ్యామ్‌ప్రసాద్‌, సినీ బృందం శంకర్‌ ప్రసాద్‌, గౌతమ్‌, బుజ్జి, దివ్యకుమార్‌, వంశే శేఖర్‌ పాల్గొన్నారు. వేడుకకు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించి ఆకట్టుకున్నారు. సినీ హీరో హీరోయిన్లు నాగశౌర్య, మెహరిన్‌లను చూడటానికి అధిక సంఖ్యలో ప్రజలు కిటకిటలాడారు.logo