
కల్లూరు, అక్టోబర్ 18: కరోనా సమయంలో మానవత్వాన్ని చాటుకున్న సినీనటుడు సోనూసూద్ ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారికీ సాయపడ్డాడు. కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరమని చిన్నారి బంధువుల ద్వారా తెలుసుకున్న తిరువూరుకు చెందిన జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం.రాంప్రతీప్ సామాజిక మాధ్యమాల్లో ఆ సమస్య పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జూలైలో బాబు పుట్టాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ బాబుకు గుండెలో సమస్య ఉందని, వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ జీవిస్తున్న కంచెపోగు కృష్ణకు అంత స్తోమత లేదు. విషయం తెలుసుకున్న తిరువూరు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను సోనూసూద్‌కు చేరవేశారు. అది చూసిన సోనూ వెంటనే స్పందించి ముంబైలోని వాడియా ఆసుపత్రిలో చిన్నారి సాత్విక్‌కు ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం ఆ చిన్నారికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను ఆరుగురు వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి విజయవంతం చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోనూసూద్‌కు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులకు, వైద్యులకు ఆ చిన్నారి తల్లదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.