
పూలవనాన్ని తలపిస్తున్న నివాస గృహ ఆవరణం
మొక్కలపై మక్కువతో ఆరుబయటా కుండీలే
ఇంటినంతా మొక్కలతో తీర్చిదిద్దిన సుధాకర్‌రావు
బోనకల్లు, నవంబర్ 11: చిన్న ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. అందులో రకరకాల మొక్కలు, చెట్లు. ఎటు చూసినా పచ్చందమే..! ఆ ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే.. ‘మమ్ము చూడు.. మా అందం చూడు..’ అన్నట్లుగా రకరకాల పూలు పలకరిస్తుంటాయి. ‘మేము కూడా ఉన్నామండోయ్..’ అన్నట్లుగా చెట్లు తమ కొమ్మలను సుతారంగా ఊపుతూ చల్లటి గాలితో హాయిగొల్పుతాయి. ఈ మధురానుభూతి కొందరికి కేవలం ఆకాంక్షగా, తీరని కలగా మిగిలిపోతుంది. కొద్దిమంది మాత్రమే తమలోని ఆ ఆకాంక్షకు ఆచరణ రూపాన్నిస్తారు. కలను ‘కళా’త్మక దృశ్యంగా నిజం చేసుకుంటారు. వారిలో ఒకరే సూర్యదేవర సుధాకర్‌రావు. బోనకల్లు మండలంలోని నారాయణపురం గ్రామస్తుడు. ప్రకృతి ప్రేమికుడు. ఆయనకు మొక్కలు, చెట్లంటే విపరీతమైన ఇష్టం. తన ఇంటి ఆవరణను, బయటి రోడ్డును కూడా ప్రకృతి వనంలా మార్చేశారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు, చెట్లు పెంచుతున్నారు. ఎటు చూసినా పచ్చందం కనిపించేలా తీర్చిదిద్దారు. ఇంటి ముందున్న రోడ్డుకు ఇరువైపులా కూడా మొక్కలు నాటారు. వాటన్నిటినీ పసి పిల్లల్లాగా అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ ఇంటి పచ్చందాలను ఆస్వాదించేందుకు ఇటీవల ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. “ఇంటినే ప్రకృతి వనంగా తీర్చిదిద్దావ్..” అంటూ, ‘ప్రకృతి ప్రేమికుడు’ సూర్యదేవర సుధాకర్‌రావును అభినందించారు.