అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్
వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం
కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ పాటించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాత్రమే ఓటు హకు కలిగి ఉంటారని పేర్కొన్నారు. డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ, 24న స్క్రూటీని, 26న ఉపసంహరణకు చివరి గడువు ఉందన్నారు. డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిషేధమని వెల్లడించారు. ఎన్నికల ప్రచార సభల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, రాజిరెడ్డి, పద్మాకర్, కే సురేందర్‌రెడ్డి, పైడిపల్లి రాజు, కల్యాడపు ఆగయ్య, సత్తినేని శ్రీనివాస్, గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.