
కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ
హెల్త్ సర్వే ఫీవర్ టెస్టింగ్ ప్రారంభం
ఖమ్మం, మే 9: కరోనాను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటి హెల్త్ సర్వే ఫీవర్ టెస్టింగ్‌ను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. ఆదివారం తన 26వ డివిజన్లో స్వయంగా ఇంటింటికీ వెళ్లి థర్మల్ ఫీవర్ టెస్టింగ్‌ను నిర్వహించారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావకాన్ని పిచకారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఇంటింటికీ ఫీవర్ టెస్ట్ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఇంటి వద్దకే వచ్చే ఆరోగ్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితిగతుల గురించి చెప్పాలని అన్నారు. ఒకవేళ చిన్నపాటి జ్వరం ఉన్నా వెంటనే ఆరోగ్య సిబ్బంది మందులు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తద్వారా రోగాలు దరిచేరకుండా చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, జిల్లా డీఎంసీ సుజాత, 23వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే మక్బుల్, సుడా డైరెక్టర్ ఎండీ ఖాదర్‌బాబా, బీసీ సెల్ ఖమ్మం నగర ఆర్గనైజర్ గౌతం బాబా, టీఆర్ఎస్ నాయకులు మున్నా, బీఎల్ఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.