భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/ మామిళ్లగూడెం, ఏప్రిల్ 27 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారం నుంచి ఇంధన సమస్య తలెత్తడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆయిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. బంకుల వద్ద మాత్రం వాహనాలు వరుసకట్టి కనిపిస్తున్నాయి. ప్రధాన స్టాక్ పాయింట్ల నుంచి పెట్రోల్, డీజిల్ జిల్లాకు చేరుతున్నా.. బంక్ యజమానులు మాత్రం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టలేకపోతున్నారు.
ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఖమ్మం నగరంతోపాటు ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు పురపాలికల్లో, కొత్తగూడెం, పాల్వంచ, చండ్రుగొండ, భద్రాచలం ప్రాంతాల్లో వినియోగం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలతోపాటు రవాణాకు దగ్గరగా ఉన్న మండల కేంద్రాలతోపాటు వ్యవసాయ పనులు, పంట కోతల సమయం కావడంతో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు తమ అవసరాలను సరిపడా ఇంధనం దొరుకుతుందో లేదో అనే అపోహలతో క్యాన్లు, డబ్బాలలో నింపుకుని అదనంగా నిల్వ పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు గ్యాస్ కొరతతో ఇబ్బందిపడిన ప్రజలు.. ఇప్పుడు వాహనాలకు పెట్రోల్, డీజిల్ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తగూడెం, పాల్వంచ పారిశ్రామిక ప్రాంతాలు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో వాహనాలకు ఇంధనం సరిపోకపోవడంతో బంకుల వద్ద వాహనాలను క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఆదివారం రాత్రి పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఉన్న బంకులో బస్టాండ్ వరకు వాహనదారులు బారులుదీరారు. ఇక పాల్వంచ కేఎస్ఎం బంకు వద్ద లారీలు క్యూ కట్టాయి. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆంధ్రా నుంచి లారీలు డీజిల్ కోసం రావడంతో క్యూ పెరిగినట్లు బంక్ యజమానులు చెబుతున్నారు.
బంకులలో పెట్రోల్, డీజిల్ కొరతను ఆసరా చేసుకున్న కొందరు ప్రైవేటు వ్యాపారులు వాహనదారుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొత్తగూడెంలో లీటర్ పెట్రోల్ రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే బంకుల్లో లభించని ఇంధనం బయట వ్యాపారులకు ఎలా దొరుకుతుందని వారు ఆరోపిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం డీజిల్, పెట్రోల్ వాహనాలపై తీసుకెళ్లి అక్కడ ఎక్కువ రేట్లకు విక్రయాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నియంత్రణ లేకపోతే రానున్న రోజుల్లో ఇంధన కొరతను ఎక్కువ రోజులు ఎదుర్కోవాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇంధన కొరత ఉండడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి ఇంధన కంపెనీల యజమానులతో మాట్లాడాను. సమస్య ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నందున వెంటనే పరిష్కరించాలని కోరాను. ఆయా జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరాను. పంట యంత్రాలకు డీజిల్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ప్రస్తుత కోతల సీజన్ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా డీజిల్ అందేలా చూడాలి.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు