కొడిమ్యాల, ఫిబ్రవరి 22 : కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి నీళ్లు రాకుండా మూసిన తూమును ఓపెన్ చేసి రైతులకు ఎల్లంపల్లి నీరు అందించి పంటలు కాపాడాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శ్రీరాములపల్లికి ఎల్లంపల్లి నీరు రాకుండా మూసిన తూమును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు త్వరగా తూమును తెరిపించాలని కోరారు.
గత పదేళ్లలో ఒక్క గుంట వరి ఎండకుండా ఎల్లంపల్లి నీటిని అందించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలు ఎండుతున్నాయన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామ మైసమ్మ చెరువుకు నీటిని ఎత్తిపొసే పంపులు బంద్ అయ్యాయని, గతేడాది మాదిరిగా పంటలు ఎండుతాయనే అనుమానంతో రైతులు పొలాలలను కొంత బీడు ఉంచుకొని వరి వేసినట్లు చెప్పారు. తక్కువ పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎండకాలంలోనూ నీళ్లు ఎక్కువగా ఉండి రైతులు వరి కోయడానికి చైన్ (పట్టాల) మిషన్‌ను వినియోగించే పరిస్థితి ఉండేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు నీళ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరండ్ల నరేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ మాజీ మెంబర్ బండపల్లి అంజన్‌కుమార్, ప్యాట అంజి, రైతులు తదితరులున్నారు.