health and hygiene | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 11: మహిళలు తమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ శ్రీలత అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల వోక్సి దీనదయాల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో మహిళలు, విద్యార్థులకు గురువారం అవగాహన శిబిరం నిర్వహించారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. నిరంతరం కుటుంబ బాధ్యతలతో ఇక్కట్లు పడుతున్న మహిళలు సమతుల్యమైన ఆహారం తీసుకోవటంలో నిర్లక్ష్యం కనబరుస్తుండటంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. శ్రమకు తగిన కేలరీల ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాల్సిన ఆవసరముందని అన్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవసరమైన సహాయ, సహాకారాల కోసం జిల్లా మహిళా సాధికారత కేంద్ర సిబ్బందిని ఎప్పుడైనా కలవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజమణి, మహిళా సాధికారత కేంద్ర జనరల్ స్పెషలిస్టు శైలజ, సెంటర్ మేనేజర్ మమత, సిబ్బంది శ్రీనివాస్, రాములు, అనిల్‌రాజు, మనోజ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.